నీట మునిగిన చేతికొచ్చిన పంటలు.. నల్లబారుతున్న పత్తి.. పొలాల్లోనే మొలకెత్తుతున్న పెసర
నేటి వారధి ప్రతినిధి ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం రైతన్నలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు జలమయమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట తడిసి నల్లబారుతుండగా, పెసర పంట పొలాల్లోనే మొలకెత్తుతోంది. మరోవైపు మిర్చి పంటకు మాత్రం ఈ వర్షం కొంత మేలు చేసే అవకాశం ఉంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు కళ్లముందే దెబ్బతింటుండటంతో రైతన్నలు కన్నీటిపర్యంతమవుతున్నారు. భారీ వర్షాల కారణంగా వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది.

