తాటినగర్ గ్రామానికి గర్వకారణంగా నిలిచిన యువకుడు. కృషి, పట్టుదలతో సాధించిన విజయం యువతకు స్ఫూర్తి
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన ఆదే మహేష్ ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గ్రామానికి చెందిన ఆదే భీమయ్య–గనాబాయి దంపతుల కుమారుడైన మహేష్ సాధించిన ఈ విజయం కుటుంబానికే కాకుండా గ్రామానికీ గర్వకారణంగా మారింది. దేశ రక్షణ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ఆర్మీ ఉద్యోగం సాధించిన మహేష్ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చాడని గ్రామస్తులు పేర్కొన్నారు. కష్టపడి చదివి, పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న అతని విజయం గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. మహేష్ ఎంపిక సందర్భంగా గ్రామపంచాయతీలో తాటినగర్ సర్పంచ్ కత్కార్ మౌనిక–అనిల్, ఉప సర్పంచ్ సాజన్, వార్డ్ మెంబర్ ఉమేష్, పంచాయతీ కార్యదర్శి తిరుపతమ్మ, గ్రామస్తులు కలిసి ఆదే మహేష్ కు శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కత్కార్ మౌనిక–అనిల్ మాట్లాడుతూ ఆదే మహేష్ సాధించిన విజయం తాటినగర్ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించడం ద్వారా మహేష్ గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచాడని అన్నారు. ఉప సర్పంచ్ సాజన్ మాట్లాడుతూ గ్రామ యువతలో ప్రతిభకు కొదవలేదని, సరైన మార్గనిర్దేశం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం అవుతాయని పేర్కొన్నారు. మహేష్ విజయం ఇతర యువతకు దిశానిర్దేశం చేస్తుందని అన్నారు.గ్రామం తరఫున యువతకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.తనకు లభించిన సన్మానానికి స్పందించిన ఆదే మహేష్ మాట్లాడుతూ తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గనిర్దేశం, గ్రామ ప్రజల ఆశీస్సులే ప్రధాన కారణమని తెలిపారు. దేశ సేవలో నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు.

