నేటివారధి
ఓబీసీల ఓట్లయితే కావాలి కానీ,రాజ్యాధికారంలో సముచిత స్థానమివ్వరా?: ఎంపీ రవిచంద్ర

సిద్ధించి 77 ఏండ్లు గడిచినా కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం: ఎంపీ రవిచంద్ర
ఓబీసీల న్యాయమైన హక్కుల సాధనకు, వాటా దక్కించుకునేందుకు పార్లమెంట్ లోపల,బయట బీఆర్ఎస్ పోరాడుతున్నది: ఎంపీ రవిచంద్ర
కేసీఆర్ బీసీలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల పక్షపాతి: ఎంపీ రవిచంద్ర
కేసీఆర్ పాలనలో బీసీలకు సముచిత గౌరవం లభించింది: ఎంపీ రవిచంద్ర
తెలంగాణ మంత్రివర్గంలో బీసీలు ఉన్నది ఇద్దరు మాత్రమే,6 ఖాళీల భర్తీలో ప్రాధాన్యతనివ్వాలి: ఎంపీ రవిచంద్ర
చట్టసభల్లో ఓబీసీలకు 33%రిజర్వేషన్స్ కల్పించాలి: ఎంపీ రవిచంద్ర
దేశవ్యాప్తంగా కులగణనను వెంటనే చేపట్టాలి: ఎంపీ రవిచంద్ర
కులగణనను వెంటనే చేపట్టి పార్లమెంటులో ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇంటెలెక్చువల్స్ ఫోరం వ్యవస్థావకులు రిటైర్డ్ ఐఏఏస్ అధికారి చిరంజీవులు ఆధ్వర్యాన మహాధర్నా
ఎంపీ రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పురుషోత్తమ రావు తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరు
ఎన్నికలప్పుడు తమ ఓబీసీల ఓట్లయితే కావాలి కానీ రాజ్యాధికారంలో సముచిత స్థానం ఎందుకు కల్పించడం లేదంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పాలకులను నిలదీశారు.దేశ జనాభాలో తాము 60శాతానికి పైగా ఉన్నా కూడా అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీ రవిచంద్ర ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం ఓబీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం వ్యవస్థావకులు రిటైర్డ్ ఐఏఏస్ అధికారి చిరంజీవులు ఆధ్వర్యాన జరిగిన మహాధర్నాకు శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సర్థార్ పుటం పురుషోత్తమ రావు తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, దేశవ్యాప్తంగా కులగణనను వెంటనే చేపట్టాలి, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలంటూ ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించి 77 ఏండ్లు గడిచినా కూడా ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓబీసీకి చెందిన వారైనప్పటికీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. ఓబీసీల న్యాయమైన హక్కుల సాధనకు, వాటా దక్కించుకునేందుకు పార్లమెంట్ లోపల, బయట బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తున్నదని ఎంపీ రవిచంద్ర చెప్పారు.మన న్యాయమైన హక్కుల సాధనకు ఈ జంతర్ మంతర్ వద్ద బడుగుల లింగయ్య యాదవ్, శ్రీనివాస్ గౌడ్,బీద మస్తాన్ రావు తదితర ప్రముఖులతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు గట్టిగా డిమాండ్ చేశామన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో బీసీలకు సముచిత ప్రాధాన్యత లభించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.కేసీఆర్ బీసీలు,రైతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల పక్షపాతి అని,ఆయన హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని ఆయన వివరించారు.రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీలు ఇద్దరు మాత్రమే ఉన్నారని,ఖాళీగా ఉన్న 6 స్థానాల భర్తీ సందర్భంగా తమకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.దేశవ్యాప్తంగా కులగణనను వెంటనే చేపట్టి పార్లమెంటులో ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా చట్టసభల్లో తమకు 33%రిజర్వేషన్స్ కల్పిస్తూ మహిళలతో పాటు అమలుపర్చాలని ప్రధాని మోడీని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.రాజ్యాధికారంలో తమ ఓబీసీలకు న్యాయమైన వాటా దక్కే వరకు బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా గొంతెత్తి నినదిస్తూనే ఉంటుందని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు సిద్ధేశ్వర్,కిరణ్,వేల్పుల శ్రీనివాస్,పర్వతం సతీష్, అరుణ,చామకూరి రాజు,డీ.వేలాద్రి,కే.వీ.గౌడ్ తదితరులతో కలిసి వందలాది మంది పాల్గొన్నారు.
“జై బీసీ జైజై బీసీ”,”ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి”,”చేపట్టాలి చేపట్టాలి కులగణనను దేశవ్యాప్తంగా వెంటనే చేపట్టాలి”,”ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టాలి పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టాలి”,”వర్థిల్లాల్లి వర్థిల్లాల్లి ఓబీసీల ఐక్యత వర్ధిల్లాలి”,”పోరాడుదాం పోరాడుదాం న్యాయమైన హక్కుల సాధనకు, వాటా దక్కించుకునేందుకు పోరాడుదాం”అనే నినాదాలతో జంతర్ మంతర్ పరిసరాలు దద్దరిల్లాయి.

