బాలికకు మెరుగైన వైద్యం, బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి PYL రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్ డిమాండ్
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ ప్రాంతంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం, ఆపై భవనం పైనుంచి తోసివేసిన అనాగరిక ఘటనపై ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం (PYL) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ హేయమైన చర్య సమాజం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితుడిని కాపాడేందుకు రాజకీయ పార్టీలకు చెందిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి నిందితుడికి చట్టప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై జరుగుతున్న ఇలాంటి ఘోరాలపై సమాజంలో ప్రతి ఒక్కరూ చైతన్యంతో స్పందించాల్సిన అవసరం ఉందని, నిందితులకు గుణపాఠం చెప్పే వరకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.నిందితుడిపై పోక్సో (POCSO), హత్యాయత్నం కేసుల కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి.
భవనం పైనుంచి తోసేయడం వల్ల తీవ్రంగా గాయపడిన మైనర్ బాలికకు ప్రభుత్వ ఖర్చులతోనే కార్పొరేట్ స్థాయి అత్యుత్తమ వైద్య సేవలను తక్షణమే అందించాలి.
శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయాన్ని (ఎక్స్గ్రేషియా 50 లక్షలు) ప్రకటించి, అన్ని రకాలుగా ఆదుకోవాలి.నిందితుల వైపు నుండి బెదిరింపులు వచ్చే అవకాశం ఉన్నందున బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ పూర్తి రక్షణ కల్పించాలి.ఇలాంటి ఘోరమైన ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాలు వేగంగా అమలు కావాలని, బాధిత చిన్నారికి మరియు వారి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎన్.వి. రాకేష్ స్పష్టం చేశారు.

