జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి వారధి న్యూస్ ప్రతినిధి, మంచిర్యాల జిల్లా:రాష్ట్ర ఉపమఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జూన్ 13వ తేదీన జిల్లాలో పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయాన్ని డిసిపి ఎ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గిరిజన సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, దండేపల్లి మండల తహశీల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్, ఆలయ ఈఓ శ్రీనివాస్ లతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జూన్ 13వ తేదీన ఉదయం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం పునర్నిర్మాణం, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో సింగరేణిలో వైద్య పరంగా విధులు నిర్వహించలేని ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందజేస్తారని, సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియాలో ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలిస్తారని, అనంతరం మంచిర్యాల పట్టణంలో విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని వేంపల్లి ప్రాంతంలో గల పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాట్లను డిసిపి, మంచిర్యాల శాసనసభ్యులు, ఎసిపి ప్రకాష్ లతో కలిసి పరిశీలించారు. తదనంతరం మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్ ను సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ తో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

