అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే.తిరుగుబాటు అంత ప్రతిధ్వనిస్తుంది ఐక్యమైన విద్యార్థి శక్తి ముందు ఏ నిరంకుశత్వమైనా తలవంచాల్సిందే
నేటి వారధి (ప్రతినిధి)
ఖమ్మం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కేవలం ఒక పదవీ త్యాగం మాత్రమే కాదని, అది కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిరంకుశ, అణచివేత వైఖరిపై భారత విద్యార్థి, యువజన లోకం సాధించిన చారిత్రక విజయమని ప్రగతిశీల యువజన సంఘం (PYL) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల నెత్తుటి త్యాగాలు, మడమ తిప్పని సమరశీల పోరాటమే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ఈ రాజీనామా బాట పట్టేలా చేసిందని ఆయన ఉద్ఘాటించారు.విద్యాశాఖలో పేరుకుపోయిన తీవ్ర అవినీతి, నిరుద్యోగంపై యువత సల్పిన ఆగ్రహ పోరాటం ముందర అణచివేతలు, బుల్డోజర్ సంస్కృతి మరియు కార్పొరేట్ శక్తుల బలం నిలబడలేవని ఈ ఉద్యమం మరొకసారి రుజువు చేసింది. రాజ్యాంగ విలువల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, రాజ్య వ్యవస్థలతో కుమ్మక్కైన తీరుపై విద్యార్థి లోకం ‘చలిచీమల దండు’లా ఏకమై కడిగిపారేసింది. తమ హక్కుల కోసం, విద్యా-ఉపాధి కోసం ప్రశ్నించే ప్రతి విద్యార్థిని, పౌరుడిని ‘దేశద్రోహులు’గా చిత్రీకరించే బీజేపీ ప్రభుత్వ కుట్రలకు ఈ ఉద్యమ విజయం ఒక బలమైన చెంపపెట్టు లాంటిది.
ఈ సమరశీల విద్యార్థి ఉద్యమం అందించిన స్ఫూర్తితో దేశంలో ప్రతి విద్యార్థి, యువకుడు ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం నేటి జెన్ జెడ్ (Gen Z) తరం ఐక్యమై ముందుకు కదలాలన్నారు. దేశంలో నిరంకుశ ధోరణులను శాశ్వతంగా పాతరేసే వరకు, విద్యా హక్కులను కాపాడుకునే వరకు ప్రతి విద్యార్థి ఈ స్ఫూర్తితో మరొక స్వాతంత్ర్య సంగ్రామంలా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎన్ వి రాకేష్ కోరారు.

