రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
మంచిర్యాల జిల్లా
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. జిల్లాలోని చెన్నూరు మండల కేంద్రంలో గల శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య, చెన్నూరు మున్సిపల్ చైర్మన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారి లతో కలిసి 60 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. రైతుల ఆర్థిక అభివృద్ధి కొరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి మద్దతు ధరతో నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం 1 లక్ష 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం నిర్ణీత తేదీకి ముందుగానే 1 లక్ష 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, అకాల వర్షాల దృష్ట్యా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో లారీలు, హమాలీల సమస్యలు లేకుండా కొనుగోలు ప్రక్రియ విజయవంతం చేయడం అభినందనీయమని తెలిపారు. మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ మహిళల గౌరవాన్ని పెంపొందించే విధంగా మహిళ శక్తి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణ సదుపాయం కల్పించి వివిధ వ్యాపారాలలో ప్రోత్సహించడం జరుగుతుందని, ఆర్టిసి అద్దె ఒప్పందంతో మహిళ సంఘాలకు బస్సులు అందించి అదనపు ఆదాయం పొందే విధంగా తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సోలార్ పవర్ ప్లాంట్ లు వంటి అనేక వ్యాపారాలలో మహిళలను భాగస్వామ్యలను చేయడం జరుగుతుందని, ఆర్టిసి బస్సుల ద్వారా ఒక్కొక్క బస్సుకు 70 వేల రూపాయల ఆదాయం చేకూరుతుందని తెలిపారు. మహిళలు వ్యాపార రంగంలో మరింత రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను అధికారులతో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, చెన్నూరు లో 25 వేల మంది జనాభా ఉన్నారని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు లో 5 పడకలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు వెళ్లకుండా స్థానికంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు మండల కేంద్రంలో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా 23 మంది వైద్యులతో పాటు సిబ్బందిని నియమించి వైద్య పరికరాలు, ఫర్నిచర్ సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందించడం జరుగుతుందని, త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభించడం జరుగుతుందని, ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగిందని, సిసి రోడ్లు, మురుగు కాలువలు, సోలార్ హైమాస్ లైట్ల ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యా వ్వస్థను బలోపేతం చేస్తూ చెన్నూరు నియోజకవర్గ పరిధిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి దాదాపు 2 వేల మది విద్యార్థులకు విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, డిగ్రీ కళాశాల అభివృద్ధి కొరకు 1 కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. చెన్నూరు లో పోచమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని, కూరగాయల, మాంసపు ఉత్పత్తుల మార్కెట్ ఏర్పాటు చేసి వ్యాపారులకు అవకాశం కల్పించడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో 2 అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 30 కోట్ల రూపాయలతో నీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టి ఇంటింటికి త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, చెన్నూరు ప్రాంతంలో 15 సంవత్సరాల వరకు నీటి కరువు లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. మున్నూరు కాపు, ముదిరాజ్, మెరుగు, పద్మశాలి, అంబేద్కర్, మైనారిటీలకు కమ్యూనిటీ హాల్ ల ఏర్పాటుకు నిధులు అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, 2వ విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసి 1 సంవత్సర కాలంలో టెండర్ ప్రక్రియ, నిర్మాణం చేపట్టి త్వరగా పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. 100 పడకల ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేపట్టి భవిష్యత్తు తరాలలో మార్పు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. విద్యా రంగంలో కేంద్ర నివేదికలో మంచిర్యాల జిల్లా 3వ స్థానంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మొదటి స్థానంలో ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో 5 వేల మంది విద్యార్థులు చేరారని తెలిపారు. బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని, మాత శిశు ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల ఏర్పాటుతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని, వాక్సినేషన్ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం చెన్నూరు మున్సిపల్ కార్యాలయానికి మంజూరైన 4 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. ఒక్కొక్క వాహనం 10 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో 8 వాహనాలు కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం అందిన వాహనాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

