నేటి వారధి న్యూస్ ప్రతినిధి, మంచిర్యాల జిల్లా:తెలంగాణ రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత దివంగత ఎండి మునీర్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జూన్ 14 ఆదివారం మందమర్రి పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో నిర్వహించడం జరుగుతుందని మునీర్ మిత్రులు, శ్రేయోభిలాషులు జి చందర్, వాసాల శంకర్, పల్లె సమ్మయ్య, ఉప్పులేటి నరేష్ లు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగిగా జర్నలిస్టుగా ఈ ప్రాంత ప్రజల సమస్యల సాధన, హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు కలం యోధుడు మునీర్ అని అన్నారు. నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేసి వాటికి పరిష్కారం చూపిన ప్రజానేత అని తెలిపారు. దేశ ప్రగతి కోసం పకృతికి విరుద్ధంగా బొగ్గు బావులలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కళ్ళకు కట్టినట్టు వార్త కథనాలు రాసిన కలం యోధుడని అన్నారు. విద్యార్థి దశ నుండి ప్రగతిశీల, ప్రజాస్వామ్యం భావజాలంతో పనిచేసినటువంటి మునీర్ సమాజంలో ఒక దిక్సూచిగా మారారని తెలిపారు. మందమర్రి పట్టణానికి ముఖచిత్రం మునీర్ అని, మరణించేంతవరకు బొగ్గు బావులు అగ్గి రవ్వల వెలిగిన వ్యక్తి అని అన్నారు. ఆకలితో అలవటిస్తూ ఉన్న పేదల ఆకలి కోసం మట్టి తింటే మన్నే పరమాన్నం అనే శీర్షికను రాశి రాష్ట్రం దిగివచ్చేలా చేసిన జనం జర్నలిస్ట్ అని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు పోయేంతవరకు పని చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మునీర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరని, అందుకే ఆయన జ్ఞాపకార్థం ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పలువురు పత్రిక సంపాదకులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఎండి మునీర్ పుస్తకావిష్కరణ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

